వైఎస్ షర్మిల సీఎం కావడం ఖాయం: మాజీ మంత్రి డీఎస్ (వీడియో)
భవిష్యత్తులో వైఎస్ షర్మిల సీఎం కావడం ఖాయమని మాజీ మంత్రి డీఎస్ జోస్యం చెప్పారు. గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎం అవుతారని తాను చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్: భవిష్యత్తులో YS Sharmila సీఎం కావడం ఖాయమని మాజీ మంత్రి D. Srinivas జోస్యం చెప్పారు.మాజీ మంత్రి డీఎస్ ను YSRTP చీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. వైఎస్ కూడా సీఎం అవుతారని 2003లోనే తాను చెప్పిన విషయాన్ని డీఎస్ గుర్తు చేశారు.
గత ఏడాది క్రితం వైఎస్ఆర్‌టీపీని ఏర్పాటు చేసి Telanganaలో షర్మిల పాదయాత్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని షర్మిల ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ఏర్పాటు చేసిన రాజకీయంగా తన పునాదిని సుస్థిరం చేసేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి మంగళవారం నాడు నిరుద్యోగ దీక్ష నిర్వహిస్తున్నారు. అంతేకాదు పాదయాత్రలు చేస్తున్నారు. రాస్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైఎస్ షర్మిల యాత్రలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో YSR రాజ్యం తెచ్చేందుకు వైఎస్ఆర్‌టీపీని ఏర్పాటు చేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను KCR అమలు చేయలేదని షర్మిల విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా ఆమె మండిపడ్డారు.
ఇదిలా ఉంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి డీఎస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికలకు ముందు డీఎస్ పై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కేసీఆర్ తో భేటీ అయి వివరణకు ఇచ్చేందుకు డీఎస్ ప్రయత్నాలు చేశారు. కానీ డీఎస్ కు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో టీఆర్ఎస్ తో ఆయన దూరంగా ఉన్నారు. అయితే గత ఏడాదిలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీతో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీతో కూడా ఆయన భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని ప్రచారం సాగింది. కాంగ్రెస్ పార్టీలో డీఎస్ చేరేందుకు ముహు్ర్తం కూడా సిద్దం చేసుకొన్నారనే ప్రచారం కూడా సాగింది. అయితే కొన్ని కారణాలతో కాంగ్రెస్ లో చేరడం ఆలస్యమైంది. కాంగ్రెస్ లోనే చేరేందుకు డీఎస్ ఆసక్తిని చూపుతున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు.ఈ తరుణంలో వైఎస్ షర్మిల డీఎస్ తో భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో పీసీసీ చీఫ్ గా డి.శ్రీనివాస్ ఉన్నారు. 2004 లో టీడీపీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కీలకంగా పనిచేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతల మధ్య సమన్వయంతో పాటు బస్సు యాత్ర చేయడంలో డీఎస్ కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని డీఎస్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.