హైదరాబాద్: తనకు పదవి ఎందుకు ఇవ్వలేదనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే అడగాలని వైఎస్ షర్మిల మీడియా ప్రతినిధులతో అన్నారు. వైసీపీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మీకు జగన్ ఎందుకు పదవి ఇవ్వలేదని అడిగితే ఆమె ఆ విధంగా స్పందించారు. బుధవారం లోటస్ పాండులోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 

మీరు బిజెపి వదిలిన బాణమా, కేసీఆర్ వదిలిన బాణమా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే దానికి తానేమి సమాధానం చెబుతానని ఎదురు ప్రశ్న వేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కూడా తాను స్పష్టత ఇచ్చినట్లు ఆమె తెలిపారు. తెలంగాణలో మాత్రమే మేలు చేయాలని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించగా ఆంధ్రప్రదేశ్ లో చేయాలని అనిపించలేదని ఆమె అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పాలన కన్నా జగన్ పాలన బాగుందని ఆమె అన్నారు. అక్కడ ప్రతిపక్షంా కూడా బాగానే ఉందని, ప్రశ్నిస్తోందని, తెలంగాణలో ప్రతిపక్షం లేదని ఆమె అన్నారు. పాదయాత్ర చేస్తారా అని అడిగితే, పాదయాత్ర చేస్తేనే గెలుస్తామని అందరూ అనుకుంటున్నారని ఆమె అన్నారు. 

దానిపై ఇంకా ఏదీ పూర్తి స్థాయిలో నిర్ణయం చేయలేదని షర్మిల చెప్పారు. ఏదో ఒక కార్యక్రమం చేస్తానని, జనంలో ఉండాలన్నదే తన లక్ష్యమని, అమరవీరులు తెచ్చుకున్న తెలంగాణ సంక్షేమ తెలంగాణ కావాలని ఆమె అన్నారు