Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో స్పీడ్ పెంచిన షర్మిల...!

షర్మిల.. తెలంగాణలో స్పీడ్ పెంచారు.  ఆమె తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా నేతలతో ఆమె సమావేశమైన సంగతి తెలిసిందే.

YS Sharmila start Khammam tour Soon
Author
Hyderabad, First Published Feb 12, 2021, 7:34 AM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం వైస్ జగన్ సోదరి షర్మిల.. తెలంగాణలో స్పీడ్ పెంచారు.  ఆమె తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా నేతలతో ఆమె సమావేశమైన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె గురువారం ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఆ జిల్లా నేతల విన్నపం మేరకు ఆమె ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని కొండా రాఘవరెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. 

‘దివంగత నేత వైఎస్సార్‌కు ఖమ్మం జిల్లా బ్రహ్మరథం పట్టిందని అక్కడి నేతలు షర్మిలకు వివరించారు. ఈనెల 21న ఉమ్మడి ఖమ్మం జిల్లా వైఎస్సార్‌ అభిమానులతో ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు అక్కడి గిరిజనులకు 90 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూముల్ని కొందరు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాధిత గిరిజనులతో ఆమె 45 నిమిషాలు ప్రత్యేకంగా సమావేశమవుతారు. అంతేగాకుండా 500 మంది ముఖ్య నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుంటారు..’అని ఆయన వివరించారు.  

ఉదయం 8 గంటలకు భారీ కాన్వాయ్‌తో.. 
ఈ నెల 21న ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా షర్మిల ఖమ్మం వెళ్లనున్నారని రాఘవరెడ్డి తెలిపారు. ‘హైదరాబాద్‌ నుంచి హయత్‌నగర్, చౌటుప్పల్, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, పాలేరు మీదుగా ఆమె ఖమ్మంలోకి ప్రవేశిస్తారు. అందుకు సంబంధించి దారి పొడుగునా భారీగా స్వాగత ఏర్పాట్లు ఉంటాయి. ఖమ్మం చేరుకున్నాక మొదట ఆమె వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఏ జిల్లాకు వెళ్లినా 2004 నుంచి ఇప్పటివరకు వైఎస్సార్‌ పరిపాలన కాలంలో జరిగిన అభివృద్ధి, తర్వాత అనేక మంది ముఖ్యమంత్రుల కాలంలో రాష్ట్రంలో పరిస్థితులపై షర్మిల సమీక్ష చేస్తారు. వైఎస్సార్‌ అంటేనే అభివృద్ధి, సంక్షేమం..’అని ఆయన పేర్కొన్నారు.  

 
ఇదిలా ఉండగా షర్మిలతో వైఎస్సార్‌ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారని రాఘవరెడ్డి తెలిపారు. ఆమె పాదయాత్ర చేసినప్పుడు వెన్నంటి ఉన్న వ్యక్తి ఆళ్ల అని.. ఇది కేవలం మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని ఆయన వెల్లడించారు. కాగా, షర్మిల హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లారు. మూడ్రోజుల పాటు అమె అక్కడే ఉంటారని.. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌ వచ్చాక పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెడ్తారని సమాచారం.


 

Follow Us:
Download App:
  • android
  • ios