Asianet News TeluguAsianet News Telugu

పెద్ది సదర్శన్ రెడ్డి మగతనంతో నాకేం పని.. కేటీఆర్ భార్య ఆంధ్రాకు చెందినవారు కాదా?: వైఎస్ షర్మిల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొన్ని రోజులుగా తన పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. 

YS Sharmila slams Trs and questions KTR Wife Locality
Author
First Published Dec 1, 2022, 1:52 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొన్ని రోజులుగా తన పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌టీపీకి వస్తున్న ఆదరణ చూసి టీఆర్ఎస్‌ భయపడుతోందని అన్నారు వైఎస్ షర్మిల గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై‌ సౌందర్‌రాజన్‌ను కలిశారు. పాదయాత్రను అడ్డుకోవడం, దాడి ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, వైఎస్సార్‌టీపీ  ప్రజాప్రస్థాన యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నాలను గవర్నర్‌కు వివరించడం జరిగిందన్నారు. 

నర్సంపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు తమ బస్సుకు నిప్పు పెట్టి, తమ మనుషులను కొట్టి విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయకుండా.. కేసీఆర్ డైరెక్షన్‌లో తన పాదయాత్రను అడ్డుకున్నారని విమర్శించారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈ ప్రయత్నాలు చేశారని విమర్శించారు.  తనను అరెస్ట్ చేస్తేనే పాదయాత్ర ఆగుతుందని భావించారని అన్నారు. అరెస్ట్ చేసిన తర్వాత తమ వాళ్లను పోలీసులు ఇష్టమొచ్చినట్టుగా కొట్టారని ఆరోపించారు. పోలీసులు తనను  రిమాండ్‌కు అడిగారని ప్రశ్నించారు. తాను 3,500 కి.మీ పాదయాత్ర చేశానని.. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాలేదని అన్నారు. కావాలని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించి తన పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. 

కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. దేశంలోనే అత్యంత ధనవంతమైన కుటుంబం కేసీఆర్‌ది అని ఆరోపించారు. కేసీఆర్‌‌ కుటుంబానికి వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు ఉందన్నారు. కాంట్రాక్టుల పేరుతో కేటీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీపై అన్ని రకాల విచారణలు జరగాలని అన్నారు. 

మునుగోడులో ఎంత ఖర్చు పెట్టారో, అంతకుముందు హుజురాబాద్‌లో ఎంత ఖర్చు పెట్టారో విచారణ జరగాలని  అన్నారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్‌లో దాడులు చేస్తే వేల కోట్లు దొరుకుతాయని ఆరోపించారు. తాము అవినీతి గురించి ప్రశ్నిస్తే రెచ్చగొట్టడం అవుతుందా? అని ప్రశ్నించారు. ఓ నీకృష్ట మంత్రి మరదలు అన్నాడు కనుకే తాను అతని గురించి మాట్లాడాల్సి వచ్చిందన్నారు. 

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన షర్మిల.. తాను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై వ్యక్తిగతంగా ఎలాంటి కామెంట్ చేయలేదని చెప్పారు. అలా అన్నట్టుగా ఏదైనా వీడియో ఉంటే చూపించాలన్నారు. ఆయన మగతనంతో తనకేం పని అని అన్నారు. ఆయన ట్రాక్టర్ డ్రైవర్ అని, ఎల్‌ఐసీ ఏజెంట్ మాదిరిగా ఏజెంట్ అని అన్నానని.. అది నిజమో? కాదా? చెప్పాలని అన్నారు.  
 
తాము కోర్టు అనుమతితోనే తాము పాదయాత్ర చేస్తున్నామని చెప్పారు. పాదయాత్ర మళ్లీ మొదలుపెట్టనున్నట్టుగా చెప్పగానే.. టీఆర్ఎస్  నాయకులు బెదిరించే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాదయాత్ర చేస్తే దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారని అన్నారు. ఆంధ్రవాళ్ల పెత్తనం ఏమిటని మాట్లాడుతున్నారని.. అసలు కేటీఆర్ భార్య ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఆమె ఆంధ్రా ఆవిడ కాదా అని అడిగారు. తాము ఆమెను గౌరవించడం లేదా?.. ఏమైనా విడాకులు తీసుకోమని అడిగామా? అని ప్రశ్నించారు. ఆడపిల్ల అంటేనే ఆడ.. పిల్ల అని అర్థం ఉందన్నారు. మీరు చేస్తే సంసారం.. పక్కనోడు చేస్తే వ్యవభిచారామా?.. ఇదెక్కడి  న్యాయం అని ప్రశ్నించారు. తాను ఇక్కడే పెరిగా.. ఇక్కడే  చదువుకున్నా.. ఇక్కడే పెళ్లి  చేసుకున్నా.. ఇక్కడే కొడుకుని కన్నా..  చెప్పారు. తన గతం ఇక్కడే ఉందని.. భవిష్యత్ కూడా ఇక్కడేనని అన్నారు. 

రేపు తమ పాదయాత్ర మొదలవుతుందని చెప్పారు. తమకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని అన్నారు. తనకు ఏమైనా జరిగిన, తమ వాళ్లకు ఏమైనా జరిగినా పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలకు తెలియజేసేలా లేఖ రాశామని అన్నారు. తెలంగాణ అఫ్ఘానిస్తాన్‌లా మాదిరిగా మారిందని, కేసీఆర్ తాలిబన్ నాయకుడని విమర్శించారు. ఉద్యమకార్లను తరిమేసి.. పార్టీలో తాలిబన్లను చేర్చుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

షర్మిల బీజేపీ కోవర్టు చేస్తున్న విమర్శలపై కూడా ఆమె స్పందిచారు. తాను వేరే ఏదైనా పార్టీ నచ్చి అందులో చేరితో.. పాదయాత్ర చేసి ఇంతలా కష్టపడే అవసరం ఉండకపోయేదని అన్నారు. తాను పాదయాత్ర చేసి ఇంకో పార్టీకి మైలేజ్ ఇస్తానా? అని  ప్రశ్నించారు. ప్రజలు కోసం, ప్రజల మధ్యలో పాదయాత్ర చేస్తున్నామని  చెప్పారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు. ఇక, మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే గతంలో కేసీఆర్, కేటీఆర్ బూతులు మాట్లారని విమర్శించిన షర్మిల.. అందుకు సంబంధించిన వీడియోలను కూడా ప్రదర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios