తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఏమిటో తెలిసినా కేసీఆర్ ప్రస్తుతం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఇప్పుడైనా, ఎప్పుడైనా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ నియంత, నిరంకుశ పాలనను బొంద పెట్టడానికి జనం ఎప్పటినుండో రెడీగా వున్నారని షర్మిల మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతం అవుతోందని... వీటినుండి ప్రజల దృష్టిమరల్చడానికే కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రచారానికి తెరతీసారని షర్మిల ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందన్న మాట వాస్తవం... దీన్ని కేసీఆర్ గమనించే కొత్త నాటకాలు ప్రారంభించారన్నారు. రాష్ట్ర సమస్యలను పక్కదారి పట్టించాలనే కేసీఆర్ ముందస్తు, వెనుకస్తూ అంటూ మాట్లాడుతున్నారన్నారని అన్నారు. ఎక్కడ అధికారం చేజారుతుందోనని కేసీఆర్ భయం పట్టుకున్నమాట వాస్తవమన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న సమస్యలను షర్మిల గుర్తుచేసారు. ఓటేసి గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల ఆరోగ్యాన్ని కేసీఆర్ పట్టించుకోవడం లేదని... దొరగారి పనితనానికి నిదర్శనం మిషన్ భగీరథ అని మండిపడ్డారు. స్వచ్ఛమైన నీరు ఇస్తున్నామని గప్పాలు చెప్పుడే తప్పితే మాంసం ముద్దలతో కలుషిత నీళ్లు పంపిణీ అవుతున్నా పట్టించుకొన్నది లేదన్నారు. నల్లకాడ కొట్లాటలు బంద్ అయ్యాయో లేదో కానీ విషం నీళ్లతో మనుషుల ప్రాణాలు మాత్రం పోతున్నాయని షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు.
read more గద్వాల్ లో కలుషితనీరు తాగి నలుగురు మృతి, 56మందికి అస్వస్థత..!
ఇటీవల గద్వాల్ లో మిషన్ భగీరథ నీరు తాగి వందల మంది అస్వస్థతకు గురికాగా ముగ్గురు చనిపోయిన విషయాన్ని షర్మిల గుర్తుచేసారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయిన నీటి కారణంగా 90మంది దవాఖానల పాలయ్యారన్నారు. నిర్వహణ లేని పాత ట్యాంక్ లకు కొత్త సున్నం వేసి ,పాత పైపులైన్లకే కొత్త కనెక్షన్లు ఇచ్చి కోట్లు కొల్లగొట్టి తూతూమంత్రంగా భగీరథ పనులు కానిచ్చి ప్రజల ప్రాణాలు తీసున్నాడంటూ సీఎం కేసీఆర్ పై షర్మిల ఫైర్ అయ్యారు.
