వైఎస్ షర్మిలకు చెందిన వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నట్టుగా ప్రచారం సాగుతుంది. షర్మిల ఇటీవల వ్యవహరిస్తున్న తీరు కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. 

దివంగత నేత వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే ఆమె కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరవుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో ఆమె కాంగ్రెస్‌తో కలిసి పనిచేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటన చేయనున్నారని.. వైఎస్సార్‌టీపీని హస్తం పార్టీలో విలీనం చేయబోతున్నట్టుగా ప్రచారం సాగుతుంది. షర్మిల ఇటీవల వ్యవహరిస్తున్న తీరు కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. 

కొద్ది రోజుల క్రితం ఈ వ్యవహారంపై ప్రశ్నించగా.. తనకు మిస్‌డ్ కాల్స్ వస్తున్నాయనే కామెంట్స్ చేశారు. అయితే తనకు అలాంటి ఆలోచన లేదని చెప్పారు. అయినప్పటికీ ఆ ప్రచారానికి మాత్రం పుల్‌స్టాప్ పడలేదు. తాజాగా వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా రాహుల్‌పై ప్రజాసేవను కూడా కొనియాడారు. రాహుల్ ఆయన ప్రయత్నాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నట్టుగా షర్మిల పేర్కొన్నారు. 

‘‘రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మీ పట్టుదల, సహనంతో ప్రజలకు స్ఫూర్తినిస్తూ.. మీ హృదయపూర్వక ప్రయత్నాల ద్వారా వారికి సేవ చేస్తూ ఉండండి. మీరు గొప్ప ఆరోగ్యం, ఆనందం, సమృద్ధిగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి సత్సబంధాలు లేవన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీకి షర్మిల విషెస్ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తద్వారా కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే విషయంలో షర్మిల ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఎందుకంటే.. వైఎస్సార్ మరణం తర్వాత ఆయన కుటుంబం కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రె పార్టీ ఏర్పాటు.. షర్మిల సోదరుడు వైఎస్ జగన్‌పై అక్రమాస్తుల కేసు వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. ఇక, వైఎస్ జగన్ జైలులో ఉన్న సమయంలో షర్మిలనే వైసీపీ ముందుకు నడిపించారు. సుదీర్ఘ పాదయాత్ర కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర విభజన.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీకే పరిమితం అయింది. అక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి షర్మిల కూడా తనవంతు ప్రయత్నాలు చేశారు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. షర్మిల సడెన్‌గా తెలంగాణకు షిఫ్ట్ అయి ఇక్కడ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకోస్తాననే నినాదంతో షర్మిల తెలంగాణలో పార్టీని నడిపిస్తున్నారు. తెలంగాణలో సుధీర్ఘ పాదయాత్ర కూడా నిర్వహించారు. అయితే షర్మిల ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆమె ఒక్కరు తప్ప.. చెప్పకోదగ్గ పార్టీలో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ప్రజల నుంచి కూడా ఊహించిన స్థాయిలో స్పందన రావడం లేదని రాజకీయ విశ్లేషకుల అంచనా. కేసీఆర్ ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతున్న అనుకున్నంత మైలేజీ రావడం లేదనే భావనలో షర్మిల ఉన్నట్టుగా తెలుస్తోంది. 

మరోవైపు తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఓ ఒక్క అవకాశాన్ని కూడా ఒదులుకోకూడదనే భావనతో ఉంది. ఈ క్రమంలోనే షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవడానికి ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ వ్యవహారం వెనక వైఎస్సార్ ఆత్మగా పేరుపొందిన కేవీపీ రామచంద్రా రావు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది.