టీఎస్‌పీఎస్‌సీ  కార్యాలయం ముట్టడికి వెళ్లిన  వైఎస్ షర్మిలను  ఇవాళ పోలీసులు అరెస్ట్  చేశారు.  పేపర్ లీక్  ఘటనను నిరసిస్తూ   వైఎస్ఆర్‌టీపీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 


హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లిన వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను శుక్రవారంనాడు హైద్రాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ ను నిరసిస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వైఎస్ఆర్‌టీపీ ప్రకటించింది. 

ఇవాళ ఉదయం నాంపల్లిలోని టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్దకు వైఎస్ షర్మిల వచ్చారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. షర్మిలను గుర్తించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ షర్మిల టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించారు. షర్మిలతో పాటు వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు కూడా రోడ్డుపై కూర్చుని నిరసనకు దిగారు. దీంతో ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడింది. పోలీసులు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం నుండి ఆమెను తరలించారు. వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

షర్మిలను అరెస్ట్ చేసే సమయంలో వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు పోలీసులను అడ్డుకున్నాయి. పోలీసులకు,వైఎస్ఆర్‌టీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో పెద్దవాళ్లను తప్పిస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ కేసులో చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆందోళనకు పిలుపునివ్వగానే హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తను లుకౌట్ నోటీసులు ఇచ్చారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. తానేమైనా క్రిమినలా అని ఆమె ప్రశ్నించారు. తన ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారని వైఎస్ షర్మిల చెప్పారు.

నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను నిన్న రాత్రే ఇంటి నుండి బయలకు వచ్చినట్టుగా ఆమె చెప్పారు. హోటల్ రూంలో నిన్న తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆమె చెప్పారు. మీ కూతురు లిక్కర్ స్కాంలో , మీ కొడుకు రియల్ ఏస్టేట్ స్కాం, మీరేమో కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని షర్మిల విమర్శించారు.