Asianet News TeluguAsianet News Telugu

అప్పుడు జగన్.. ఇప్పుడు షర్మిల.. వారి అరెస్ట్‌లకు కేంద్ర బిందువుగా ఉమ్మడి వరంగల్..!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

ys sharmila arrest in narsampet recollets ys jagan arrest on the way to mahbubabad in 2010
Author
First Published Nov 28, 2022, 5:17 PM IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల నిర్వహిస్తున్న షర్మిల పాదయాత్ర ప్రస్తుతం వరంగల్ జిల్లా నర్సంపేటలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే షర్మిల పాదయాత్రలో స్థానికల ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే షర్మిల పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. 

అయితే వైఎస్ షర్మిలను వరంగల్ జిల్లాలో అరెస్ట్ చేయడం.. గతంలో చోటుచేసుకున్న పరిణామాలను గుర్తుకు తెస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇదే వరంగల్‌ జిల్లా‌లో (ప్రస్తుతం మహబూబాబాద్)కు వెళ్తుండగా షర్మిల సోదరుడు వైఎస్ జగన్‌ను అప్పుడు నల్గొండ జిల్లాలో భాగమైన వంగపల్లి (ప్రస్తుతం యాదాద్రి జిల్లా) వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన 2010 మే నెలలో చోటుచేసుకుంది. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు, పరిణామాలు వేరు అయినప్పటికీ.. నాడు జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లే క్రమంలో అరెస్ట్ కావడం, నేడు షర్మిల పాదయాత్ర చేస్తున్న సమయంలో అరెస్ట్ కావడానికి ఉమ్మడి వరంగల్ కేంద్ర బిందువుగా ఉండటం గమనార్హం. 

అప్పుడు కడప ఎంపీగా ఉన్న వైఎస్ జగన్.. తన తండ్రి మరణం నేపథ్యంలో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి చేపట్టిన ఓదార్పు యాత్రలో భాగంగా అప్పుడు వరంగల్‌ జిల్లాలో భాగమైన మహబూబాబాద్‌‌కు బయలుదేరారు. అయితే జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అయితే జగన్ మాత్రం తాను ఓదార్పు యాత్రను ఎట్టి పరిస్థితుల్లో చేపడతాననే పట్టుదలతో ఉన్నారు.

ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్‌ 2010 మే 28న హైదరాబాద్ నుంచి రైలులో మహబూబాబాద్‌కు బయలుదేరారు. ఆ సమయంలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో హింస చెలరేగింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. ఆ సమయంలో వైఎస్ జగన్ మహబూబాబాద్ వస్తున్నారని తెలుసుకున్న పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్‌లో మాజీ మంత్రి కొండా సురేఖతో పాటు మరికొందరిపై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓవైపు జగన్ అనుకూలంగా కొండా సురేఖ వర్గం.. మరోవైపు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారుల మధ్య ఘర్షణతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ యుద్ధభూమిని తలపించింది. ఈ పరిస్థితుల్లో మహబూబాబాద్‌లో 144 సెక్షన్‌ విధించారు. ఇక, మహబూబాబాద్‌కు వెళ్తున్న వైఎస్ జగన్‌ను పోలీసులు ఉమ్మడి నల్గొండ జిల్లా వంగపల్లి స్టేషన్‌లో జగన్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. సమైక్యవాదం వినిపించిన జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకోవడానికి తెలంగాణలో పలుచోట్ల ఉద్యమకారులు పెద్ద ఆందోళనలు నిర్వహించారు. అయితే మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఘటన మాత్రం తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిపోయింది. 

ఇప్పుడు షర్మిల విషయానికి వస్తే.. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టిన షర్మిల కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.నిరుద్యోగులు, రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కొన్నిసార్లు పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక, షర్మిల ప్రజా ప్రస్తానం పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తన పాదయాత్రలో భాగంగా ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె పాదయాత్ర సాగుతున్న మార్గంలో.. స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలుచోట్ల షర్మిలకు టీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఆమెకు తీవ్ర స్థాయిలో నిరసన ఎదురవుతుంది. 

అయితే సోమవారం(నవంబర్ 28) షర్మిల పాదయాత్రలో ఉదయం నుంచి ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల నైట్ హాల్ట్ చేస్తున్న బస్సుకు నిప్పుపెట్టిన టీఆర్ఎస్ శ్రేణులు.. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన షర్మిల.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను నైట్ హాల్ట్‌కు వినియోగించే బస్సును టీఆర్ఎస్ గుండాలు తగలబెట్టారని అన్నారు. తమ వాళ్లపై దాడులు కూడా చేశారని ఆరోపించారు. విజయవంతంగా సాగుతున్న పాదయాత్రను ఆపేందుకు కేసీఆర్ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించి.. తనను అరెస్ట్ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. తాను పాదయాత్రను కొనసాగిస్తానని చెప్పారు. అయితే షర్మిల పాదయాత్ర చేసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నర్సంపేట పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios