హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. తొలిసారిగా ప్రగతిభవన్ లో భార్య భారతితో  కలిసి కేసీఆర్ ఇంటికి వెళ్లారు. 

జగన్ దంపతులకు తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ వైయస్ జగన్ ను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్ తినిపించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైయస్ జగన్ ను కౌగిలించుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ విజయం అందుకున్నారంటూ అభినందనలు తెలిపారు. వైయస్ భారతిని లోపలికి ఆహ్వానించిన కేసీఆర్ భార్య కోడలను పరిచయం చేశారు. అనంతరం వైయస్ జగన్ తో ముచ్చటించారు. వైయస్ జగన్ కు శాలువా కప్పారు. 

అనంతరం తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ లతోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేసీఆర్ స్వయంగా పరిచయం చేశారు. 

ప్రతీ ఒక్కనేతను వైయస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఇకపోతే వైయస్ జగన్ దంపతులతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు కూడా కేసీఆర్ ఇంటికి వెళ్లారు. 

విజయసాయిరెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. మరో ఎంపీ మిథున్ రెడ్డిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆప్యాయంగా కౌగిలించచుకున్నారు. రెండోసారి ఎంపీగా గెలిచిన సందర్భంగా అభినందనలు తెలిపారు.