హైదరాబాద్ నగరంలో భారీ చోరీ జరిగింది. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ చోరీ జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.... మహంకాళి ఆలయ సమీపంలో రోహిత్, నవకార్ నగల దుకాణాలు ఉన్నాయి. వీటిలో రోహిత్ నగల దుకాణం బంగారు ఆభరణాలు తయారు చేస్తుంది. వీరి వద్ద నుంచి నవకార్ నగల దుకాణం ఆభరనాలు కొనుగోలు చేస్తోంది.

ఈ లావాదేవీలకు సంబంధించి రూ.30లక్షల నగదును తీసుకొని రోహిత్ నగల దుకాణానానికి చెందిన రూపారామ్ అనే వ్యక్తి నవకార్ నుంచి తన దుకాణానికి బయలుదేరాడు. ఈ క్రమంలో నవకార్ మొదటి అంతస్తు సెల్లార్ లో వేచి ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు రూపారామ్ పై పెప్పర్ స్ప్రే చల్లి అతని వద్ద ఉన్న నగదు సంచిని తీసుకొని ద్విచక్రవాహనంపై పరారయ్యారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీసీ కెమేరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.