ప్రస్తుతం దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది.  తమను ఎవరైనా లైంగిక వేధిస్తే.. యువతులు బయటకు వచ్చి నిర్భయంగా  మీటూ అంటూ చెప్పేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తీవ్రతరం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ కూడా అప్రమత్తమైంది.

మహిళల భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ తెలంగాణ డీజీపీ అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.  కాగా.. డీజీపీ చేసిన ట్వీట్ కి ఓ యువకుడు చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ప్రస్తుత కాలంలో మహిళలతోపాటు పురుషులు కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న సందర్భాలున్నాయి. భార్యలు పెట్టే హింసలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ‘‘మగవాళ్లు వేధింపులకు గురైతే ఎక్కడికి వెళ్లాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి’’ అంటూ ఓ యువకుడు డీజీపీకి ట్వీట్ చేశాడు.

 

కాగా అతని ట్వీట్ కి డీజీపీ స్పందించారు. మహిళల కోసం ఏవైతే హెల్ప్ నెంబర్లు కేటాయించారో.. వాటికే పురుషులు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. లేదంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సిందిగా వివరించారు.