మైనర్ బాలిక అందులోనూ ఆమె మానసికంగా సరిగా ఎదగలేదు. అలాంటి బాలికపై కామాంధుల కన్ను పడింది. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన కుత్బుల్లాపూర్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్ పరిధికి చెందిన మతిస్థిమితం సరిగా లేని బాలిక(14) ఈ నెల 20వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ మళ్లీ తిరిగి రాలేదు. రోడా మేస్త్రీ నగర్ లో బుధవారం నడుచుకుంటూ వెళ్తున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు అపహరించారు.

బాలికను  ఓ పాడుబడిన భవనంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అర్థరాత్రి దాటిన తర్వాత బాలికకు ఫోన్ ఇచ్చి కుటుంబసభ్యులతో మాట్లాడించారు. బాలిక పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్ డేటా ఆధారంగా బాలికను గుర్తించారు.

బాలిక ఆచూకీ కనుగొన్న తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు అక్బర్, జుమన్, గయాజ్, అలీ లుగా గుర్తించారు. వారిలో ఒకరు పరార్ కాగా.. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.