తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసి.. అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ యువకుడు జైలు పాలయ్యాడు. ఓటు వేసే సమయంలో సెల్ ఫోన్లు వెంట తీసుకువెళ్లవద్దని .. అధికారులు ప్రకటించారు. ఓటు వేసేటప్పుడు గోప్యత పాటించాలని.. ఫోటో తీసినా, సెల్ఫీ దిగినా.. కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ హెచ్చరించారు కూడా. అయినప్పటికీ.. ఓ యువకుడు ఆ  నియమాన్ని ఉల్లంఘించాడు.

రాజేంద్రనర్ లో ఓ యువకుడు ఓటువేస్తూ.. ఫోటో తీసుకున్నాడు. దీంతో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. యువకుడు ఉప్పర్ పల్లికి చెందిన శివశంకర్ గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. ఉదయం 9గంటల సమయానికి 10శాతం పోలింగ్ నమోదైంది.  మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.