పబ్జీ గేమ్ మరో యువకుడు ప్రాణం తీసింది. పబ్జీ గేమ్ కి బానిసగా మారిన ఓ యువకుడు.. ఆ గేమ్ కారణంగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జగత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారంపల్లికి చెందిన సాగర్ అనే 20 ఏళ్ల యువకుడు పబ్జీ గేమ్ కి బానిసగా మారాడు. గత 45 రోజులుగా పదే పదే ఈ గేమ్ ఆడుతూ ఉన్నాడు. కంటిన్యూస్ గా ఆడటంతో అతని మెడ నరాలు పట్టేశాయి. దీంతో అతని పరిస్థితి విషమించడంతో.. అతనిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు.

గత 5 రోజులుగా వైద్యులు సాగర్‌కు చికిత్స అందించగా.. నరాలు పూర్తిగా దెబ్బతినడంతో తుదిశ్వాస విడిచాడు. ఇక పబ్జీ గేమ్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సాగర్‌ను చూపిస్తూ.. అతని స్నేహితులు ఓ అవార్‌నెస్‌ వీడియోను కూడా రూపొందించారు.

పబ్‌జీ గేమ్‌ ఆడటం ఎంత ప్రమాదకరమో సాగర్‌ పరిస్థితి చూసి తెలుసుకోండని ఆ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ పబ్జీ కారణంగా  ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది చదువులో కూడా వెనకపడిపోయారు.