ఎల్బీనగర్ ఫ్లైఓవర్ పై ఓ ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

బాలానగర్ సమీపంలోని ఫతేనగర్ కు చెందిన ఉదయ్ రాజ్(18) అనే యువకుడు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న మేనమామ కూమార్తె అనుష(20)ను మంగళవారం పరీక్షా కేంద్రానికి ద్విచక్రవాహనంపై తీసుకువచ్చాడు. పరీక్ష అనంతరం ఇద్దరు సంఘీ టెంపుల్ కి బయలు దేరారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ పైకి చేరుకోగానే.. వెనకనుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు వీరిని ఢీకొట్టింది.

దీంతో.. ఉదయరాజ్ అమాంతం గాల్లో ఎగిరి ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడ్డాడు. దీంతో.. యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. అనూషకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు.. మరో బైక్ ని కూడా ఢీ కొట్టింది. దీంతో.. ఆ వాహనంపై వెళ్తున్న సైదాబాద్ కి చెందిన బీటెక్ విద్యార్థి సాయి ప్రియ(20), బానోత్ నగేష్(17) కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎల్బీనగర్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ని ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.