గడ్డిచుట్టే మిషన్ లో చేయి ఇరుక్కుని చనిపోయిన విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లిలో జరిగింది. కాపాడే వాళ్లు లేక ఓ యువకుడు గంటసేపు నరకయాతన అనుభవించి చనిపోయిన విషయం తల్లిదండ్రులతో పాటు గ్రామంలోని ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టేలా చేసింది. 

చిట్యాల మండలం నైన్ పాక గ్రామానికి చెందిన జంగ రాజయ్య, సాంబ లక్ష్మి దంపతుల కుమారుడు మహేష్ ఇంటర్ వరకు చదువుకున్నాడు, ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు ఆపేసి ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 

బుధవారం ట్రాక్టర్ యజమానితో కలిసి గిద్దెముత్తారం శివారులోని పొలంలో వరిగడ్డి కట్టలు కట్టేందుకు వెళ్లాడు. యంత్రం సహాయంతో గడ్డిని చుట్టలు చుడుతుండగా.. ఉండలు కట్టే దారం అయిపోవడంతో కొత్తది తెచ్చేందుకు యజమాని ఊళ్లోకి వెళ్లాడు. ఇంతలో మిషన్ ట్రబుల్ ఇచ్చింది. 

అయితే మిషన్ ఇంజిన్ ఆపకుండానే ఆ సమస్యేంటో చూడబోయాడు మహేష్. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అతని చేయి మిషన్ లో ఇరుక్కుపోయింది. ఒక్కక్షణం జరిగిందేమిటో అర్థం కాలేదు.. వెంటనే బాధతో కేకలు వేశాడు. పొలంలో చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో అతని అరుపులు అరణ్యరోధనలే అయ్యాయి. 

మిషన్ ఆపే అవకాశం లేక, రక్తం కారిపోతూ, చేయి మెలితిరుగుతూ మహేష్ గంటసేపు నరకం అనుభవించాడు. ట్రాక్టర్ యజమాని ఊర్లోనుండి వచ్చేసరికి మహేష్ రక్తం మడుగులో అచేతనంగా పడి ఉన్నాడు. వెంటనే 108కి కాల్ చేస్తే వాళ్లు వచ్చి చూసి మహేష్ అప్పటికే చనిపోయాడని తెలిపారు. చేతికందివచ్చిన కొడుకు ఇలా అర్థాంతరంగా, దారుణంగా చనిపోయవడం ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.