పెళ్లి విందు ఓ యువకుడి ప్రాణం తీసింది. పెళ్లిలో మాంసం వండి పెట్టలేదంటూ మొదలైన ఘర్షణ చిలికి  చిలికి గాలివానగా మారి.. చివరకు ఓ యువకుడి ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా దాచారంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 దాచారంలోని ఓ ఇంట్లో వివాహం సందర్భంగా.. వధువును తీసుకువచ్చేందుకు వరుడి బంధువులు, కులపెద్ద సూరారం చంద్రయ్యతోపాటు మరికొందరు జనగామ జిల్లా కొడకండ్ల మండలం పాకాలలోని వధువు ఇంటికి మంగళవారం వెళ్లారు.

అక్కడ మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. మటన్‌ వడ్డింపులో తేడా చూపుతున్నారంటూ దాచారం గ్రామానికి చెందిన వెంకటయ్య వారి కులపెద్ద చంద్రయ్యతో గొడవ పడ్డాడు. బంధువులు కల్పించుకుని సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. మంగళవారం రాత్రి దాచారం చేరుకున్నాక.. అదే విషయమై చంద్రయ్యతో వెంకటయ్య మళ్లీ గొడవకు దిగాడు.

ఈ క్రమంలో.. చంద్రయ్య, అతడి కుమారులు పరశురాములు, నాగరాజుపై వెంకటయ్య, ప్రవీణ్‌, కృష్ణ, యాదమ్మ, చింటూ, వెంకటమ్మ, చిల్లర రమేశ్‌ దాడి చేశారు. ప్రవీణ్‌ గొడ్డలితో దాడికి దిగడంతో.. పరశురాములు(26) మృతి చెందాడు. నాగరాజు చికిత్స పొందుతున్నాడు. అయితే, బాధిత కుటుంబానికి నిందితులు రూ.7.50లక్షలు పరిహారం ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు తెలిసింది.