మెదక్ జిల్లాలో కుల కట్టుబాట్లు ఓ యువకుడి మరణానికి దారి తీసిన దారుణ ఘటన జరిగింది. హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడని కుల పెద్దలు యువకుడికి కులబహిష్కరణ విదించారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు గత రాత్రి ఆత్మహ‌త్య చేసుకున్నాడు. 

ఈ అమానవీయ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ లో జరిగింది. ఇప్ప శంకర్ అనే వ్యక్తి ఆరేళ్లుగా ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ మధ్యే కోర్టు కేసు కొట్టివేయడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. 

విడుదలయ్యి ఇంటికి వచ్చిన తరువాత తాను జైల్లో ఉన్న స‌మ‌యంలోనే తమ కుటుంబాన్ని కుల పెద్దలు కులం నుంచి బ‌హిష్కరించారని తెలిసింది. అంతేకాదు శంకర్ కు కోర్టు నుంచి విముక్తి లభించినా, కుల పెద్దల ఆంక్షల నుంచి విముక్తి లభించలేదు. 

జైలు నుంచి విడుదలైన ఇతడు మళ్లీ కులంలోకి రావాలంటే మూడు లక్షల నష్టపరిహారం చెల్లించాలనికండీషన్ పెట్టారు. ఈ తీర్పు విన్న శంకర్ షాకయ్యాడు. ఇదెక్కడి న్యాయం అంటూ, తాను ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించే వచ్చానని చెప్పినా వినలేదు. దీంతో జ‌న‌వ‌రి 6వ తేదీన అల్లాదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. 

కానీ పోలీసులు కూడా పట్టించుకోలేదు. దీంతో శంకర్ తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతను చనిపోయేముందు సెల్ఫీ వీడియోలో తీసుకున్నాడు. అది ఇప్పుడు వైరల్‌గా మారింది. 

శంకర్ బలవన్మరణంతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.