జుట్టు రాలే సమస్య ఈ మధ్యకాలంలో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. పని ఒత్తిడి, కాలుష్యం తదితర కారణాల వల్ల చిన్న వయసులోనే జుట్టు ఊడిపోతోంది. అయితే... ఈ సమస్య కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన నితిన్‌ మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఉప్పల్‌ సత్యానగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. నితిన్‌ క్యాటరింగ్‌ పని చేస్తూ, ప్రతి వారం తల్లిదండ్రులకు కొంత డబ్బు పంపించేవాడు. జుట్టు రాలిపోతుండడం తీవ్రమనోవేదనకు గురిచేస్తోందని, ఎప్పటికైనా డబ్బు సంపాదిస్తే హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకుంటానని స్నేహితులతో చెబుతుండేవాడని పోలీసులు వెల్లడించారు.

కొద్దిరోజుల క్రితం సోదరి వివాహం కుదరడంతో కొన్ని డబ్బులు పంపించమని ఇంటి నుంచి నితిన్‌కు ఫోన్‌ చేశారు. కరోనా కారణంగా క్యాటరింగ్‌ పని కూడా సరిగా దొరకడం లేదు. ఈనెల 25న ఉదయం స్నేహితులు పని మీద బయటకు వెళ్లిన తర్వాత ఒంటరిగా ఉన్న నితిన్‌ గదిలో ప్యాన్‌కు పంచెతో ఉరి వేసుకున్నాడు. స్నేహితులు తిరిగి రాగా, గదికి తలుపు పెట్టి ఉంది. ఎంత పిలిచినా పలకక పోవడంతో అనుమానం వచ్చి, ఇంటి యజమానిని పిలిచి తలుపులు బలవంతంగా తీశారు. 

కాగా.. లోపల నితిన్ ఉరివేసుకోని కనిపించాడు. జుట్టురాలే సమస్య కారణంగానే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.