దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ తో... చాలా మంది నేరస్తుల్లో ప్రాణ భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల... భార్య, భర్తలను చంపి పరారైన ఓ నిందితుడు... ఈ ఎన్ కౌంటర్ ఘటన చూసి తనని కూడా ఎన్ కౌంటర్ చేస్తారేమో అనే భయంతో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరో యువకుడు చేరాడు. సంగారెడ్డి జిల్లాలో స్నేహితురాలిని కిరాతకంగా గొంతు కోసి చంపిన కేసులో నిందితుడైన జాదవ్ అరవింద్(23) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... నిందితుడు జాదవ్ అరవింద్ ది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వాగాల. కాగా... తల్లిదండ్రుల తో కలిసి బతుకు దెరువు కోసం సంగారెడ్డి జిల్లా  జిన్నారం మండలానికి వచ్చాడు. కాగా... స్థానికంగా ఉండే పదో తరగతి విద్యార్థిని ప్రేమించిన అరవింద్... ఆమె వేరే యువకుడితో చనువుగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. 

దీంతో... గతేడాది ఆగస్టు 30వ తేదీన ఆమె ఇంట్లోకి చొరబడి కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు అతనిని రిమాండ్ కు తరలించారు. బెయిల్ పై బయటకు వచ్చిన అరవింద్ నాందేడ్ లోని ఓ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే...దిశ ఉదంతం అనంతరం తనకు శిక్ష తప్పదేమో అని భయపడిపోయాడు. ఈ క్రమంలో సోమవారం హాస్టల్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.