ప్రాణం కన్నా ప్రేమించిన అమ్మాయి.. ఒక్కసారిగా అన్నయ్య అని పిలవడం తట్టుకోలేకపోయాడు.  అంతే... సమీపంలోని ఓ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ లో గురువారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హిమాయత్‌నగర్‌ గ్రామానికి చెందిన మంగలి సత్తయ్యకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు వెంకటేష్‌(28) గ్రామంలోనే హెయిర్‌ సెలూన్‌ షాపు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్ానడు.  ఇటీవల ప్రేమ విషయాన్ని అమ్మాయికి చెప్పాడు. తనకు ప్రేమంటే ఇష్టం లేదని.. నిన్ను అన్నలా భావించానని యువకుడికి చెప్పింది.

దీంతో యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు.  దీంతో... సమీపంలోని గండి చెరువు  వద్దకు వెళ్లాడు. తన స్నేహితులకు ఫోన్‌చేసి ప్రేమ విషయం చెప్పి తాను చనిపోతున్నానని ఫోన్‌ కట్‌చేశాడు. స్నేహితులు చెరువు వద్దకు వెళ్లే సరికే చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

స్నేహితులు చెరువులో గాలించి అతన్ని మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.