యజమానికి తెలీకుండా.. ఆమె ఆస్తులకు నకిలీ పత్రాలు తయారు చేసి.. వాటిని తనిఖీ పెట్టి డబ్బులు కాజేశారు. ఆలస్యంగా తాను మోసపోయానని గ్రహించిన సదరు మహిళ.. తాజాగా పోలీసులను ఆశ్రయించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన విక్రమాదిత్య, మురళీకృష్ణతో పాటు మరికొందరు కలిసి ఓ ప్లాన్‌ వేశారు. బర్కత్‌పురాలో 2016 డిసెంబర్‌లో స్టైల్‌ ఆఫ్‌ అల్లూరి ఓవర్సీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఓ కంపెనీ స్థాపిస్తున్నామంటూ ఆంధ్రాబ్యాంకు కాచిగూడ శాఖ నుంచి రూ.4.5 కోట్లు లిమిట్‌ వరకు రుణ సౌకర్యం పొందారు.
 
   దానికోసం వాళ్లకు ఎలాంటి సంబంధం లేని ఓ మహిళకు చెందిన ఆస్తి పత్రాల నకలు కాపీలను తనఖా పెట్టారు.  ఆ తర్వాత బ్యాంకు నుంచి రూ.2.34 కోట్ల రుణం తీసుకుని వాయిదాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు అనుమానించి ఆస్తి పత్రాలకు సంబంధించి ఆరా తీశారు. తనఆస్తి పత్రాలు తనవద్దే ఉన్నాయంటూ సదరు మహిళ పేర్కొనడంతో మోసపోయినట్టు గ్రహించారు.

 ఈ నేపథ్యంలో సదరు మహిళ పోలీసులను  ఆశ్రయించింది. విచారణ చేపట్టిన అధికారులు నిందితుల్లో ఒకరైన కడాళి మురళీకృష్ణను అరెస్టు చేసినట్లు జాయింట్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి తెలిపారు. ఈ వ్యవహారంలో కొంత మంది బ్యాంకు ఉద్యోగులపై కూడా అనుమానాలున్నట్లు పోలీసులు గుర్తించారు.