కొద్ది రోజుల క్రితం ఓ యువతి బాయ్ ఫ్రెండ్ తో లేచిపోవడానికి ఆత్మహత్య నాటకం ఆడింది అనే వార్త చదివే ఉంటారు. అయితే... ఆమె బాయ్ ఫ్రెండ్ తో అలా వెళ్లడానికి కారణం తెలుసుకొని పోలీసులు కూడా కంగుతిన్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... సదరు యువతిది నిజామాబాద్ జిల్లా నవీపేట గ్రామం. చిన్నతనం నుంచి ఓ యువకుడిని ఇష్టపడింది. చిన్నప్పటి నుంచి పరిచయం ఉండటంతో... ఇద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు.  కానీ వారి ప్రేమ ఎక్కువ కాలం కొనసాగలేదు. అతని ప్రవర్తన లో తేడా రావడంతో అతనిని సదరు యువతి దూరం పెట్టింది. తర్వాత ఇంజినీరింగ్ చదవడానికి యువతి హైదరాబాద్ నగరానికి వచ్చింది.

అయితే... ఆ యువకుడు కూడా హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేయడానికి ఇటీవల నగరానికి వచ్చాడు.  ఆ అమ్మాయి ఇక్కడే ఉందని తెలుసుకొని మళ్లీ ఆమె వెంట పడటం మొదలుపెట్టాడు. దీంతో... యువతి ఫోన్ నెంబర్ మార్చి అతనిని దూరం పెట్టింది. అయినా కూడా ఆ యువకుడు  యువతిని వదలలేదు. గతంలో కలిసి దిగిన ఫోటోలు చూసి బెదిరించడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోకుండా ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానిని.. చంపేస్తానని, చచ్చిపోతానని బెదిరించడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో అతని వేధింపులు ఎక్కువై...యువతి ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లింది. ట్యాంక్ బండ్ వద్ద ఆత్మహత్య చేసుకుంటుండగా అక్కడ ఉన్న స్థానికులు రక్షించారు. అదే సమయంలో ఆ యువకుడు మళ్లీ ఫోన్ చేశాడు. నువ్వు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో అతని గదికి వెళ్లింది. అక్కడ పెళ్లి చేసుకోవాలంటూ మళ్లీ బతిమిలాడాడు. ఆమె అంగీకరించకపోవడంతో... సదరు యువతి కళ్లముందే చేతిని బ్లేడ్ తో కోసుకున్నాడు.

దీంతో.. తన వల్ల అతని ప్రాణం పోవడం ఇష్టంలేక పెళ్లికి యువతి అంగీరించింది. వెంటనే... ఆమెను తీసుకొని ఆ యువకుడు తన చుట్టాల ఊరైన గుంటూరు తీసుకువెళ్లాడు. అక్కడ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ లోపు యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుంటూరులో ఉన్న యువతిని పట్టుకోగలిగారు. బాధితురాలు చెప్పిన సమాచారం మేరకు పోలీసులు ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు. యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు.