గత కొంతకాలంగా... తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్న ఓ వ్యక్తిపై ఐటీ మహిళా ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా... ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళ మాదాపూర్ లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. అయితే.... ఆమె గతంలో ఓ ట్రావెల్స్ కార్యాలయంలో పనిచేసింది. ఆ తర్వాత అక్కడ మానేసింది. అయితే... అక్కడ పనిచేస్తున్న సమయంలో ఘట్ కేసర్ కొండాపూర్ ప్రాంతానికి చెందిన అఖిల్(30) అనే వ్యక్తి సూపర్ వైజర్ గా పనిచేశాడు.

అయితే.. అప్పటి నుంచే తనను పెళ్లి చేసుకోవాలంటూ అఖిల్... ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు తట్టుకోలేక అప్పుడే సదరు యువతి అఖిల్ పై ఫిర్యాదు చేసింది. అతనికి జైలు శిక్ష కూడా వేశారు.

తాజాగా... జైలు నుంచి బయటకు వచ్చిన అఖిల్.. సదరు యువతిని మళ్లీ ప్రేమ, పెళ్లి పేరిట వేధిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం మాదాపూర్ లోని ఓ కంపెనీ వద్దకు వచ్చి తన కారులో ఎక్కాలంటూ యువతిని అఖిల్ బెదిరించాడు. దీంతో.. అతని బారి నుంచి తప్పించుకున్న మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.