ములుగు: పచ్చటి అటవీ ప్రాంతం అందాలను చూడటానికి ప్రియుడితో కలిసి వెళ్లిన ఓ యువతి కామాంధుల చేతుల్లో నలిగిపోయింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని పర్యాటక ప్రదేశం బ్లాక్‌బెర్రీ ఐలాండ్‌ అటవీ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రియుడిని చితకబాది యువతిపై అత్యాచారానికి పాల్పడటమే కాదు సెల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరించారు. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఓ ప్రేమ జంట సరదాగా గడపడానికి తాడ్వాయి సమీపంలోని పర్యాటక ప్రాంతం బ్లాక్ బెర్రీ ఐలాండ్ కు బైక్ పై వెళ్లారు. అయితే వారు అటవీప్రాంతంలోకి వెళ్లడాన్ని గమనించిన బొట్టాయిగూడెంకు చెందిన సాత్విక్, ఆనందరావు లు వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతంలో ఈ ప్రేమజంటను అడ్డుకున్న ఈ ఇద్దరు యువకుడిని చితకబాది బైక్ టైర్లో గాలి తీసేశారు.  

అనంతరం యువతిని బెదిరించి తమ బైక్ పై ఎక్కించుకుని మణుగూరు వైపు తీసుకెళ్లారు. ఓ ప్రాంతంలో బైక్ ఆపి యువతిపై సాత్విక్ అత్యాచారానికి పాల్పడగా ఆనందరావు  వీడియో తీశాడు. ఇలా ఇద్దరు పలుమార్లు యువతిపై అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ లైంగికదాడి వల్ల యువతికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో కాస్త భయపడిన యువకులు ఆమెను తిరిగి బైక్ పై ఎక్కించుకుని స్వగ్రామంలో వదిలిపెట్టారు. 

అత్యాచారం జరిగినట్లు ఎవరికైనా చెబితే వీడియో సోషల్ మీడియాలో పెడతామంటూ యువతిని బెదిరించారు. అయితే ఈ బెదిరింపులకు భయపడని యువతి ఓ స్నేహితుడి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు  చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ కాటాపూర్‌ క్రాస్‌ వద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.