అతివేగం ప్రమాదకరం... హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాంతకం... ఇలా ఎంత హెచ్చరించినా కుర్రకారులో మాత్రం మార్పురావడం లేదు. అతివేగంతో ప్రయాణిస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
హైదరాబాద్: మితిమీరిన వేగం, సీట్ బెల్ట్ లేకుండా కారులో, హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనంపై ప్రయాణం ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు ఎంతలా చెబుతున్నా కుర్రకారు తీరులో మార్పురావడం లేదు. ఎవరెంత చెప్పినా వినకుండా వాహనాలపై రయ్ రయ్ మంటూ రేసింగ్ లో మాదిరిగా నడపడానికి నేటితరం యువతీయువకులు ఇష్టపడుతున్నారు. ఈ సరదాతో చాలామంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా తాజాగా ఓ యువకుడు మితిమీరిన వేగంతో వెళుతూ ఏకంగా ప్లైఓవర్ పైనుండి పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) నగరంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... మైహదీపట్నం (mehdipatnam) సమీపంలోని గోల్కొండ ఏరియాలో మహ్మద్ సర్పరాజ్ హుస్సెన్(18) కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. తన మధ్యతరగతి కుటుంబానికి చేదోడువాదోడుగా వుండేందుకు ఇంటికి సమీపంలోనే ఓ మెడికల్ షాపులో పనిచేసేవాడు.
రోజూమాదిరిగానే నిన్న(మంగళవారం) ఉదయం కూడా మెడికల్ షాప్ కు వెళ్లాడు. అయితే రాత్రి సమయంలో పనిపై షేక్ పేటకు బుల్లెట్ పై బయలుదేరాడు. అయితే అతడు టోలీచౌకీ ప్లైఓవర్ పై అతివేగంతో వెళుతుండగా ఒక్కసారిగా బైక్ అదుపుతప్పింది. దీంతో ప్లైఓవర్ పై నుండి బైక్ తో సహా హుస్సేన్ కూడా అమాంతం కిందపడిపోయింది.
ప్రమాద సమయంలో హుస్సేన్ హెల్మెట్ పెట్టుకొని లేకపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. రక్తపుమడుగులో పడివున్న అతడిని స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా హుటాహుటిన వారు ఘటనాస్ధలికి చేరుకున్నారు. రోడ్డుపై రక్తపుమడుగులో పడివున్న హుస్సేన్ ఓ అంబులెన్స్ లో దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా వుండటంతో గోల్కొండ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే హుస్సెన్ మృతిచెందాడు.
ఇలా రోడ్డుప్రమాదం హుస్సెన్ ప్రాణాలను బలితీసుకోవడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. కన్నకొడుకున్న కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్లైఓవర్ పై నుండి కిందపడటంతో హుస్సెన్ ప్రయాణించిన బుల్లెట్ కూడా నుజ్జునుజ్జయ్యింది.
ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదమే ఇటీవల గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద బైక్ యాక్సిడెంట్ కు గురయి ఇద్దరు వ్యక్తులు మరణించారు. వివరాలు.. ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ఉన్న సబ్ స్టేషన్ గేట్‌ను వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర సిద్ది జిల్లాకు చెందిన అరవింద్ కుమార్ సహో(28),మునిష్ కునర్ సాకేత్(25),రాజ్ కుమార్(21) ఉపాది నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. ఈ ముగ్గురూ నానక్ రామ్ గూడలో ఓ రూం అద్దెకు తీసుకుని నివాసం వుంటున్నారు. అయితే ఈ ముగ్గురూ బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. దీంతో అరవింద్, సాకేత్ అక్కడికక్కడే మృతిచెందగా రాజ్ కుమార్ తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
