ఇద్దరబ్బాయిలతో ఓ యువతి సాగించిన ప్రేమాయణం చివరకు ఒకరి ప్రాణాలను బలితీసుకుంది.ఈ దారుణం నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.
నిర్మల్: ఓ యువతిపై ప్రేమ ఇద్దరు యువకుల మధ్య ప్రాణాల తీసుకునేంత శతృత్వాన్ని పెంచింది. ప్రేమించిన యువతి తనకే దక్కాలని భావించిన ఓ యువకుడు మరో యువకున్ని అతి కిరాతకంగా గుండెలో కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ దారుణం నిర్మల్ జిల్లా (nirmal district)లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... దిలావర్ పూర్ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉపాధి నిమిత్తం నిర్మల్ పట్టణంలో నివాసముంటున్నాడు. అతడు ఓ కంటి ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అయితే ఇదే హాస్పిటల్ లో పనిచేసే ఓ యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారి యువతీ యువకుడు కొంతకాలం జంటగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
ఇలా కొంతకాలం సాఫీగా సాగిన వీరి ప్రేమలో అలజడి రేగింది. ప్రేమించిన వాడి తీరులో మార్పురావడం నచ్చక యువతి అతడిని దూరంపెట్టసాగింది. ప్రియురాలు దూరం పెట్టడంతో యువకుడు కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు, ఇదే క్రమంలో యువతికి ఓ ప్రైవేట్ హాస్పిటల్ లోపనిచేసే లోకేశ్వరం మండలం గడ్ చంద గ్రామానికి చెందిన మంద ప్రసాద్(24) తో పరిచయం ఏర్పడింది.
అయితే ప్రియుడికి దూరమైన యువతి ప్రసాద్ కు దగ్గరయ్యింది. అతడితో చాలా చనువుగా వుండేది. ఈ క్రమంలోనే ప్రియురాలు తనకు దూరం కావడానికి ప్రసాదే కారణమని భావించి అతడిపై కోపాన్ని పెంచుకున్నాడు యువకుడు. ఎలాగయినా యువతి నుండి ప్రసాద్ ను దూరం చేయాలని నిర్ణయించుకున్న అతడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
ప్రసాద్ అడ్డు తొలగించుకుని మళ్లీ యువతికి దగ్గరవ్వాలని భావించిన యువకుడు ఇందుకోసం ఓ కత్తిని కొనుగోలు చేసాడు. ఇది తీసుకుని యువతి అద్దెకుండే ప్రియదర్శిని నగర్ కాలనీకి వెళ్లాడు. మాట్లాడేది వుందంటూ యువతికి ఫోన్ చేయగా ఆమెకు అనుమానం వచ్చి ప్రసాద్ ను కూడా అక్కడికి రమ్మంది. ముందుగానే ఇది ఊహించిన యువకుడు ప్రసాద్ రాగానే ఒక్కసారిగా అతడితో గొడవకు దిగాడు. తనవెంట తెచ్చుకున్న కత్తితో ప్రసాద్ గుండెభాగంలో పొడిచి పరారయ్యాడు. దీంతో ప్రసాద్ రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు.
అయితే అక్కడేవున్న యువతి తన స్నేహితుల సాయంతో ప్రసాద్ ను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించింది. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమించడంతో ప్రసాద్ ప్రాణాలను డాక్టర్లు కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు.
ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో వున్నాడని... అతడికోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని డీఎస్పీ తెలిపారు.
