హైదరాబాద్: సోషల్ మీడియా అత్యంత వేగంగా సమాచారాన్ని షేర్ చేయడమే కాదు క్షణాల్లో ప్రాణాలు కూడా తీసేస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియా పుణ్యమా అంటూ అనేక బలవన్మరణాలు చోటు చేసుకుంటున్నాయి. 

తాజాగా టిక్ టాక్ ఓ యువకుడిని బలితీసుకుంది. ఎస్ఆర్ నగర్ లో ఉంటున్న సాయి అనే యువకుడు టిక్ టాక్ లో ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా సాయిని ప్రేమించింది. అయితే ఇటీవలే అవసరాల నిమిత్తం సాయి ఆమె చైన్ తీసుకున్నాడు. 

తిరిగి ఇవ్వాలంటూ సాయిని ఆమె కోరినా ఇవ్వడంలో ఆలస్యం చేశాడు. దాంతో ఆ యువతి కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో నివాసం ఉంటున్న సాయికి పోలీసులు ఫోన్ చేశారు. 

కేసు విచారణలో భాగంగా బంగారం గొలుసు కోసం ఆరా తీశారు. ఫోన్ పెట్టేసిన అనంతరం తనను అరెస్ట్ చేస్తారన్న భయంతో సాయి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.