హైదరాబాద్‌: సైదాబాద్ లోని కిరణ్ బాగ్ కాలనీలో బాడీబిల్డర్లు రెచ్చిపోయారు. ఓ సెలూన్ షాప్ లో డబ్బుల విషయంలో నెలకొన్న చిన్నగొడవపై ఆగ్రహం చెందిన బాడీ బిల్డర్లు నిండుప్రాణం బలితీసుకున్నారు. 

వివరాల్లోకి వెళ్తే కిరణ్ బాగ్ లోని ఓ సెలూన్ షాప్ లో మలక్ పేట తిరుమల హిల్స్ కు చెందిన 27 ఏళ్ల కార్తీక్ కటింగ్ వేయించుకునేందుకు వచ్చాడు. కటింగ్ వేయించుకున్న అనంతరం  డబ్బుల విషయంలో సెలూన్ యజమానికి కార్తీక్ కు చిన్నగొడవ ఏర్పడింది. 

చిన్న గొడవ సద్దుమణుగుతున్న సమయంలో అక్కడే ఉన్న బాడీ బిల్డర్లు జోక్యం చేసుకోవడంతో అది కాస్త పెద్దదిగా మారిందని సమాచారం. దీంతో బాడీ బిల్డర్లు ఆగ్రహంతో  కార్తీక్ పై దాడికి దిగారు. 

దాడిలో తీవ్రగాయాలపాలైన కార్తీకి అక్కడికక్కడే ప్రాణాలొదిలేశాడు. అయితే విషయం పోలీసులకు తెలిసినప్పటికీ విషయం బయటకు రాకుండా ఉండేందుకు మేనేజ్ చేశారని తెలుస్తోంది. అయితే మృతుడి బంధువుల వత్తిడితో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.