హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. విద్యానగర్- నల్లకుంట రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువ ఇంజనీర్ దుర్మరణం పాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. సౌత్ లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన 23 ఏళ్ల ఎండ్రిక్ హఠన్ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో ఎండ్రిక్ విద్యానగర్ నుంచి నల్లకుంట వెళ్లే దారిలో ఆంధ్ర మహిళ సభ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో బైక్‌పై అధిక వేగంతో వెళుతున్నాడు.

మితిమీరిన వేగం కారణంగా డివైడర్‌ను ఢీకొని స్తంభానికి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.