కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో విషాదం నెలకొంది. పోలీసులు వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహంతో అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు యువకుడి బంధువులు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

వివరాల్లోకి వెళ్తే అశ్వారావుపేటకు చెందిన కళ్యాణ్, నాని, అశోక్, సాయి అనే యువకులు ఏటీఎంకు వెళ్లారు. అక్కడ డబ్బులు రాకపోవడంతో వేరే ఏటీఎంకు వెళ్లారు. అక్కడ కూడా డబ్బులు రాకపోవడంతో కోపంతో ఏటీఎంను కళ్యాణ్ అనే యువకుడు తన్నాడు. 

దాంతో ఏటీఎంకు కాస్త పగిలిపోయింది. దాంతో నాని అనే యువకుడు స్థానిక ఎస్ఐ, సీఐకి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఏటీఎం పగిలిపోయిందని సమాచారం ఇచ్చి ఇంటికి వెళ్లిపోయారు.

ఆ మరుసటి రోజు ఉదయం పోలీసులు సాయి, కళ్యాణ్, అశోక్, నానిలను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వరకు వదల్లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచుకుని పోలీసులు వేధింపులకు గురి చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. 

రాత్రి తమకు సమాచారం ఇచ్చి యువకులను అప్పగించారని తెలిపారు. అయితే పోలీసులు వేధింపులు తాళలేకపోవడంతో కళ్యాణ్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమంటూ మృతుడి బంధువలు ఆరోపించారు. 

మృతుడి ఇంటి దగ్గర నుంచి మృతదేహంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దాంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.