సూర్యాపేట కలెక్టరేట్‌లో ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. భూ సమస్య పరిష్కరించడం లేదని పెట్రోలు పోసుకుని నిప్పటించుకునే ప్రయత్నం చేసింది. 

సూర్యాపేట కలెక్టరేట్‌లో ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. భూ సమస్య పరిష్కరించడం లేదని పెట్రోలు పోసుకుని నిప్పటించుకునే ప్రయత్నం చేసింది. దీంతో అప్రమత్తమైన కలెక్టరేట్‌ సిబ్బంది ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. వివరాలు.. గరిడేపల్లి మండలం కలమచెరువుకు చెందిన స్వాతి, తన కుటుంబ సభ్యులతో కలెక్టరేట్‌లో ప్రజావాణికి హాజరైంది. తమకు చెందిన భూ సమస్యను అధికారులు పరిష్కారం లేదని ఆరోపిస్తూ ఆత్మహత్యకు యత్నించింది. గరిడేపల్లి పోలీసుల అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపింది. 

ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యువతిని కలెక్టరేట్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తర్వాత యువతి కలెక్టరేట్‌లో బైఠాయించి నిరసన తెలిపింది. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ మోహన్ రావు.. గరిడేపల్లి ఎమ్మార్వోతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇది స్వాతి, ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనను విరమించి బయటకు వెళ్లారు. 

అనంతరం స్వాతి మాట్లాడుతూ.. తమ పొలం వద్దకు తాము వెళ్తుంటే పోలీసులు రివర్స్ కేసు పెట్టి వేధిస్తున్నారని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపింది. లక్ష రూపాయల లంచం ఇస్తేనే తమ పని చేస్తామని చెబుతున్నారని ఆరోపించింది. రూల్స్‌ మాట్లాడినందుకు తనపై రెండు దొంగ కేసులు పెట్టారని చెప్పింది.