యువకుడి వేధింపులు తట్టుకోలేక తెల్లవారితే పెళ్లనగా ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.
నారాయణపేట: తెల్లవారితే పెళ్ళిపీటలెక్కాల్సిన యువతి ఓ యువకుడి వేధింపులు తాళలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లికూతురు ఆత్మహత్యతో అప్పటివరకు వివాహ వేడుకలతో సందడిగా వున్న ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెళ్లిబాజాలు మోగాల్సిన ఇంట ఓ దుర్మార్గుడి నిర్వాకంతో చావుబాజా మోగింది. ఈ దారుణ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.
బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని చందాపూర్ కు చెందిన పద్మమ్మ, వెంకటప్ప దంపతుల కూతురు భీమేశ్వరి (19). ఆమెకు పెళ్లిచేయాలని నిర్ణయించిన తల్లిదండ్రులు మక్తల్ మండలం దండు ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయం చేసారు. ఇవాళ (మంగళవారం) ఉదయం 10గంటలకు వరుడి ఇంట్లో వివాహం జరగాల్సి వుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
అయితే భీమేశ్వరిని గతకొంత కాలంగా చందాపూర్ కు చెందిన నర్సిములు వేధించేవాడు. అతడి ప్రేమను యువతి నిరాకరించినప్పటికి వెంటపడుతూనే వున్నాడు. ఈ క్రమంలో యువతికి పెళ్లి నిశ్చయమైనప్పటి నుండి అతడు యువతిని బెదిరించసాగాడు. నీ పెళ్లిని చెడగొడతా... నిన్ను ఎత్తుకెళ్లి పెళ్లిచేసుకుంటానంటూ అతడు వేధిస్తుండటంతో యువతి భయపడిపోయింది. దీంతో పెళ్లికి మరికొద్ది గంటల ముందే దారుణ నిర్ణయం తీసుకుంది.
తన బాధను ఎవరూ చెప్పుకోలేక కుమిలిపోయిన భీమేశ్వరి సోమవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు నర్సిములు వేధింపుల భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ లెటర్ రాసి ఉరేసుకుంది. కుటుంబసభ్యులు చూసేసరికే ప్రాణాలు కోల్పోయి ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది.
యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని కిందకు దించి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పెళ్లిపీటలు ఎక్కాల్సిన కూతురు ఇలా ప్రాణాలు కోల్పోయి పాడెనెక్కడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లికోసమని వచ్చిన బంధువులు, స్నేహితులు అక్షింతలు వేయాల్సిన యువతిపై మట్టి వేసి అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది.
