ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడే కులం పేరుతో పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్థాపంతో దారుణమైన నిర్ణయం తీసుకుంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 

బాధితురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లాకు చెందిప అనూష అనే యువతి కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్ గా పనిచేస్తోంది. గతంలో వేరే ఆస్పత్రిలో పనిచేసిన ఈమెకు అక్కడ పనిచేసే కిరణ్  అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం  కాస్తా ప్రేమగా  మారి గత మూడేళ్లుగా కొనసాగులతోంది. 

అయితే ఈ క్రమంలో పెళ్ళి చేసుకుందామని అనూష కిరణ్ ను కోరడంతో అతడి అసలు రంగు బయటపడింది. తమ కులాలు వేరు కావడంతో ఇంట్లో వారు పెళ్ళికి ఒప్పుకోవడం లేదని తప్పించుకుని తిరగడం ఆరంభించాడు. అంతేకాకుండా పెళ్ళి పేరుతో తనను ఇబ్బంది పెడితే తన కుటుంబాన్ని రోడ్డున పడేలా చేస్తానని అనూషను బెదిరించాడు. 

 ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాడే ఇలా మోసం చేయడంతో తట్టుకోలేకపోయిన అనూష దారుణానికి పాల్పడింది. తన స్వగ్రామానికి చేరుకుని అక్కడ నిద్రమాత్రలు మింగి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన కూతురుని గుర్తించిన తల్లిందండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనూషకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు...ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే వున్నట్లు డాక్టర్లు తెలిపారు. 

అనూష తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కరీంనగర్ లోని అనూష గదిని పరిశీలించగా అందులో ఓ సూసైడ్ నోట్ లభించింది. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.