కామంతో కళ్లుమూసుకుపోయిన  ఓ తండ్రి సభ్యసమాజం సిగ్గుపడేలా ప్రవర్తించాడు. కన్న కూతురిని కాపాడాల్సిన బాధ్యతను మరిచి అతడే ఆమెను కాటేశాడు.  ఒకటి కాదు రెండు కాదు గత రెండేళ్లుగా కసాయి తండ్రి చేతిలో అఘాయిత్యానికి గురవుతూ బాలిక నరకం అనుభవించింది. చివరకు ధైర్యం చేసి స్నేహితుల సాయంతో తనపై జరిగిన అఘాయిత్యం గురించి  పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు, బాధిత బాలిక తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో వెంకటేశ్వర్లు భార్య, కూతురితో కలిసి నివాసముంటున్నాడు. ఇతడి మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కూతురు, రెండో భార్యతో కలిసి వెంకటేశ్వర్లు జీవిస్తున్నాడు. 

తల్లి ప్రేమకు దూరమై, పినతల్లి చేతిలో చిత్రహింసలకు గురవుతున్న కూతురిని అక్కున  చేర్చుకుని ప్రేమను పంచాల్సిన తండ్రే దారుణానికి పాల్పడ్డాడు. యుక్తవయసులో వున్న ఆమెను బెదిరించి తన కామ వాంచను తీర్చుకోవడం మొదటుపెట్టాడు. ఇలా గత రెండేళ్లుగా యువతిపై నిత్యం అత్యాచారానికి పాల్పడుతూ గర్భం దాల్చకుండా మెడిసిన్స్ ఇచ్చేవాడు. ఇలా ఎవరైన వేధిస్తే చెప్పాల్సిన తండ్రే లైంగిక వేధింపులకు దిగడంతో ఎవరికి చెప్పాలో తెలీక బాలిక మౌనంగా అతడి వికృతచేష్టలను భరిస్తూ వచ్చింది. 

ఈ  మధ్య కాలంలో తండ్రి మద్యం సేవించి వచ్చి పినతల్లి ముందే  దారుణానికి పాల్పడుతుండేవాడు. అయినా ఆమె కూడా తన సొంత కూతురు కాకపోవడంతో పట్టించుకోలేదు. ఇలా నిత్యం నరకాన్ని అనుభవిస్తూనే చదువును కొనసాగిస్తు యువతి తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి స్నేహితులకు చెప్పి బోరున విలపించింది. దీంతో వారు యువతిని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ దారుణం గురించి ఫిర్యాదు చేశారు. 

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి వెంకటేశ్వర్లును అరెస్ట్‌ చేశారు.  ప్రస్తుతం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.