షాద్‌నగర్: తనకు చదువుకోవాలని ఉంది, నా పెళ్లిని ఎలాగైనా ఆపాలని ఓ యువతి ఫోన్ ద్వారా షీ టీమ్ ను పోలీసులను కోరింది. ఈ ఘటన షాద్ నగర్ లో గురువారం నాడు చోటు చేసుకొంది.

రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అబ్బాయితో షాద్‌నగర్ మండలం గుండుకేరికి చెందిన అమ్మాయికి పెళ్లి సంబంధం చూశారు. ఈ నెల 31వ తేదీన పెళ్లికి ముహుర్తం నిర్ణయించారు. 

యువతి పదో తరగతి పూర్తి చేసింది.ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని తనకు లేదని ఆ యువతి కుటుంబసభ్యులకు చెప్పింది. కానీ కుటుంబసభ్యులు వినలేదు. దీంతో ఈ  పెళ్లిని ఆపాలని ఆ యువతి భావించింది.

ఈ పెళ్లిని ఆపేందుకు ఆ యువతి గురువారం నాడు షీటీమ్ కు ఫోన్ చేసింది. దీంతో పోలీసులు  ఆ యువతి ఇంటికి చేరుకొనన్నారు. పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు.  దీంతో ఐసీడీఎస్ అధికారి నాగమణికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. 

తనను ఎక్కడైనా ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించి చదువుకొనే అవకాశం కల్పించాలని కోరింది. ఐసీడీఎస్ అధికారి నాగమణి యువతి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ చేశారు.  షీటీమ్ సిబ్బంది షాద్ నగర్  సీఐ శ్రీధర్ కు సమాచారం ఇచ్చారు. యువతిని హైద్రాబాద్ లో వనస్థలిపురంలోని సఖి కేంద్రానికి తరలించారు.

చదువుకొనేందుకు వీలుగా వనస్థలిపురం సఖి కేంద్రానికి తరలించినందుకు ఐసీడీఎస్, షీటీమ్ అధికారులకు ఆ యువతి  ధన్యవాదాలు తెలిపారు.