వనపర్తి: అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఓ యువతి మృతదేహం వనపర్తి జిల్లా అమరచింత శివారులోని పత్తి పొలంలో లభ్యమయ్యింది. ఈ మృతదేహం ఆత్మకూరు పట్టణానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. 

వివరాల్లోకి వెళితే... ఆత్మకూరుకు చెందిన యువతి హైదరాబాద్ లో ఓ షోరూంలో పనిచేస్తోంది. అయితే నాలుగైదు రోజులుగా ఆమె కనిపించక పోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇదే క్రమంలో అమరచింత శివారులోని పత్తి పొలంలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

అయితే ఇది హైదరాబాద్ లో కనిపించకుండా పోయిన యువతి మృతదేహంగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే అత్యాచారం జరిపిన తర్వాత హత్యచేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఆత్మకూరుకు చెందిన యువకుడితో ఈ యువతికి మూడేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అతడికి వేరే యువతిని వివాహం జరిగింది. తన వివాహ బంధానికి అడ్డు వస్తుందని అతడేమయినా ఈ హత్యకు పాల్పడ్డాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.