తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పనిచేస్తున్న యువ డాక్టర్ ను వేధిస్తున్న ఆకతాయిని సనత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలవెనక్కి తోసారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నిర్భయ చట్టం (nirbhaya act), తెలంగాణ ప్రభుత్వం షీటీమ్స్ (she teams), ఏపీ సర్కార్ దిశ చట్టం (disha act)... ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ విషయంలో ఎన్ని కఠిన చట్టాలు చేసినా, ఎంత కఠినంగా వ్యవహరించినా వారిపై వేధింపులు మాత్రం ఆగడంలేదు. చివరకు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేసినా ఫలితంలేకుండా పోయింది. నిత్యం ఇంటా, బయట, స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు ఇలా అక్కడా ఇక్కడా అని కాదు ప్రతిచోటా ప్రతినిత్యం పెళ్లయిన మహిళ, పెళ్లీడు యువతులు, ముక్కుపచ్చలారని చిన్నారులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు.
తెలుగురాష్ట్రాల్లో మహిళలపై వేధింపులు మరీ ఎక్కువగా వున్నాయి. సామాన్య మహిళలనే కాదు ఉన్నతచదువులు చదివి సమాజంలో మంచిపేరున్న మహిళలకూ వేధింపులు తప్పడంలేదు. ఇలా తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఓ డాక్టర్ ను వేధిస్తున్న ఓ ఆకతాయిని సనత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసారు.
బోరబండ పరిధిలోని గాయత్రినగర్ కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఓ యువతి డాక్టర్ గా పనిచేస్తోంది. అయితే ఆమె హాస్పిటల్ కు వెళ్లివచ్చే సమయంలో ప్రేమ్ కుమార్(23) అనే యువకుడు వెంటపడుతూ వేధిస్తున్నాడు. నిత్యం అతడు వెంటపడుతున్నా యువతి చూసిచూడనట్లు వదిలేసింది. యువతి మౌనాన్ని అదునుగా తీసుకుని ప్రేమ్ కుమార్ మరింత రెచ్చిపోయాడు. దీంతో ఈ వేధింపులకు ఇక భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించింది.
బాధిత డాక్టర్ ఫిర్యాదుపై స్పందించిన సనత్ నగర్ పోలీసులు ప్రేమ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తమపై ఎవరు వేధింపులకు పాల్పడుతున్నా మహిళలు ఉపేక్షించరాదని... తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
