అనంతపురం: మరో పది రోజుల్లో పెళ్లి. పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇలా ఘనంగా పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగానే ఆ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పక్క రాష్ట్రం కర్ణాటకలో వైద్యుడిగా పనిచేస్తున్న పెళ్లికొడుకు స్నేహితులతో కలిసి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళితే... సిరిసిల్ల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన చంద్రశేఖర్ రావు ఆర్టీసి డ్రైవర్ గా పనిచేసి రిటైరయ్యారు. అతడికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సంతోష్ రావు ఎంబిబిఎస్ పూర్తిచేసి కర్ణాటకలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. చిన్నవాడు సవ్యసాత్వి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. 

ఇటీవలే పెద్దకొడుకు సంతోష్ కు కరీంనగర్ కు చెందిన ఓ డాక్టర్ తో వివాహం నిశ్చయమయ్యింది. ఈ నెల 26న పెళ్లి కూడా పెట్టుకున్నారు. మరో పదిరోజుల్లో పెళ్లి వుండటంతో సంతోష్ రావు స్నేహితుడితో కలిసి కారులో కర్ణాటక నుండి స్వస్థలానికి బయలుదేరాడు. ఈ క్రమంలో అనంతపురం పట్టణ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో కారులోని సంతోష్ రావుతో పాటు అతడి స్నేహితుడు కూడా మృతిచెందాడు. దీంతో శుభకార్యం జరగాల్సిన పెళ్లింట విషాదం చోటుచేసుకుంది.  పెళ్లితో కొడుకు ఓ ఇంటివాడు కానున్నాడని ఆనందంలో వున్న తల్లిదండ్రులు చావువార్త విని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇలా పెళ్లి బాజా మోగాల్సిన ఇంట చావు డప్పు మోగుతోంది.