మానుకొండూరు: దొంగతనం నిందమోపి పంచాయితీ పెట్టి మరీ అవమానించడంతో తట్టుకోలేకపోయిన ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన మానుకొండూరు నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది.    

ఈ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్‌కు చెందిన నారాయణపురం అనిల్‌(18)అనే యువకుడు ఎలక్ట్రిక్ పరికరాలు రిపేరింగ్ పని చేసేవాడు. నాలుగురోజుల కింద అతడు గ్రామంలోని మిడిదొడ్డి ఎల్లయ్య ఇంటికి వెళ్లి సౌండ్‌బాక్స్‌లు రిపేర్ చేశాడు. అయితే ఇదే రోజు ఎల్లయ్య ఇంట్లోపెట్టిన రూ.4వేలు పోయాయి. ఈ డబ్బులు అనిల్ తీశాడని అనుమానించిన ఎల్లయ్య గ్రామ సర్పంచ్ కు ఫిర్యాదు చేశాడు. 

దీంతో సర్పంచ్ అనిల్ తో పాటు అతడి తండ్రి సమ్మయ్యను పంచాయితీకి పిలిపించి డబ్బుల గురించి ఆరా తీశాడు. తాను డబ్బులు తీయలేదని అనిల్ ఎంతచెప్పినా వినిపించుకోకుండా అతడే దొంగతనం చేసినట్లు నిర్దారించారు. ఆ డబ్బులను వెంటనే ఎల్లయ్యకు చెల్లించాల్సిందిగా అనిల్ తండ్రి  సమ్మయ్యకు సూచించారు. 

ఇలా ఎలాంటి సంబంధం లేని దొంగతనాన్ని తనపై మోపి అవమానించడంతో అనిల్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో మధ్యాహ్నం సమయంలో ఇంట్లో పొలానికి కొట్టడానికి వుంచిన క్రిమిసంహారక మందు తాగాడు.దీంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో అనిల్ చనిపోయాడు. దీంతో తన కొడుకు చావుకు ఎల్లయ్యతో పాటు సర్పంచ్ కారణమని సమ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.