ప్రేమ పేరుతో యువతి వెంటపడి జైలుపాలయిన యువకుడు ఇటీవలే జైలునుండి బయటకు వచ్చి దారుణానికి పాల్పడ్డాడు. ప్రేమించిన యువతి ఇంటిబయటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పెద్దపల్లి: ప్రేమ విఫలమై తీవ్ర మనోవేధనకు గురయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువతి ఇంటిఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన సందీప్ (22) హన్మకొండలో డిగ్రీ చదువుతున్నాడు. అదే కాలేజీలో పెద్దపల్లి జిల్లా గుంజపడుగు గ్రామానికి చెందిన యువతి కూడా చదివేది. ఇలా ఒకే కాలేజీ కావడంతో పలుమార్లు యువతిని చూసిన సందీప్ మనసు పారేసుకున్నాడు. అయితే అమ్మాయికి ఇష్టం లేకున్నా ప్రేమిస్తున్నానని వెంటపడటంతో యువతి కుటుంబసభ్యులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో కొద్దిరోజుల క్రితం మంథని పోలీసులు సందీప్ పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
అయితే ఇటీవలే జైలునుండి విడుదలైన సందీప్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. ప్రాణంగా ప్రేమించిన యువతి కోసం ప్రాణాలు తీసుకోడానికి సిద్దపడ్డాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 11గంటల సమయంలో యువతి ఇంటివద్దకు చేరుకున్న సందీప్ హంగామా సృష్టించాడు. యువతి కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల ఇళ్లవారు చూస్తుండగా ఒక్కసారిగా తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు.
వెంటనే గ్రామస్తులు మంటలు ఆర్పి అంబులెన్స్ కు ఫోన్ చేసారు. చికిత్స నిమిత్తం మొదట గోదావరిఖనికి తరలించగా పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించాలని డాక్టర్లు సూచించారు. దీంతో అంబులెన్స్ లో కరీంనగర్ కు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి పూర్తిగా విషయమించడంతో సోమవారం తెల్లవారుజామున సందీప్ ప్రాణాలు కోల్పోయాడు.
