నిజామాబాద్ జిల్లాలో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. బీరు సీసాలతో ప్రియురాలి గొంతుకోసి అత్యంత కిరాతకంగా చంపడానికి ప్రయత్నించాడు.
నిజామాబాద్ : తన పుట్టినరోజు వుందంటూ ప్రియురాలిని పిలిచి అత్యంత అమానుషంగా వ్యవహరించాడో యువకుడు. సరదాగా గడిపేందుకని నమ్మించి ప్రియురాలిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బీరు సీసా పగలగొట్టి ప్రియురాలి గొంతుకోసాడు ప్రేమోన్మాది. ఈ దుర్ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు, బాధిత యువతి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన వివాహిత భర్త చనిపోవడంతో కూతురితో కలిసి జీవిస్తోంది. తండ్రి ప్రేమకు దూరమైన యువతిని సంజయ్ కుమార్ ప్రేమపేరుతో నమ్మించాడు. యువతితో పరిచయం పెంచుకుని మాయమాటలతో ప్రేమలోకి దించాడు సంజయ్. ఒక్కసారి యువతి ప్రేమలో పడ్డాక సంజయ్ లోని సైకోయిజం బయటపడింది.
ప్రియుడు సంజయ్ అతి ప్రవర్తన, సైకో చేష్టలను కొంతకాలం యువతి భరించింది. అయితే అతడి చేష్టలు మరీ మితిమీరి యువతిని అనుమానిస్తూ వేధించే స్థాయికి చేరుకున్నాయి. ఇది భరించలేక యువతి అతడిని దూరం పెట్టింది. దీంతో ప్రియురాలిపై కోపాన్ని పెంచుకున్న సంజయ్ హత్యకు కుట్రపన్నాడు.
తన పుట్టినరోజు వుందంటూ యువతిని నమ్మించిన సంజయ్ కలుద్దామని కబురు పంపాడు. దీంతో చాలాకాలం తర్వాత అతడిని కలిసేందుకు యువతి అంగీకరించింది. ఇలా జూలై 14న అంటే మూడురోజుల క్రితం యువతిని దగ్గర్లోని సాయిబాబా గుడికి బైక్ పై తీసుకెళ్లాడు సంజయ్. దైవదర్శనం చేసుకుని కొద్దిసేపు గుడివద్దే గడిపిన ఇద్దరూ తిరుగుపయనం అయ్యారు. ఈ క్రమంలోనే పెళ్లి విషయంలో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ను నిలిపిన సంజయ్ యువతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
మొదట ప్రియురాలి గొంతునులిమి చంపడానికి సంజయ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఊపిరాడక యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అంతటితో ఆగకుండా ఓ బీరు సీసాను పగలగొట్టి దాంతో విచక్షణారహితంగా యువతి గొంతుకోసాడు. రక్తపుమడుగులో పడిపోయిన ప్రియురాలు చనిపోయిందని భావించిన సంజయ్ అక్కడినుండి పరారయ్యాడు. ఇదంతా రాత్రి సమయంలో జరిగింది. కూతురు కనిపించక పోవడంతో తల్లితో పాటు కుటుంబసభ్యులు రాత్రంతా వెలికినా ఫలితం లేకుండా పోయింది.
ఉదయం యువతిని గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చిచూడగా యువతి ఇంకా ప్రాణాలతోనే వుంది. దీంతో వెంటనే నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంటనే మెరుగైన వైద్యం అందడంతో యువతి ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం యువతి కోలుకుంటోంది.
బాధిత యువతి కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సంజయ్ పరారీలో వుండగా అతడి జాడ కనుక్కుని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. యువతిని నమ్మించి ప్రేమ పేరుతో మోసం చేయడమే కాదు ప్రాణాలు తీయడానికి వెనుకాడని సైకో ప్రేమికుడు సంజయ్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని బాధిత యువతి కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
