ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఇల్లందు నియోజకవర్గం నుండి బానోతు హరిప్రియ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీలోనే కొనసాగితే భవిష్యత్ లేదని భావించి హరిప్రియ పార్టీ మారడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నాయకులతో ఆమె టచ్ లో కూడా ఉన్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ ప్రచారంపై తాజాగా హరిప్రియ స్పందించారు. 

ఇల్లందు నియోజకవర్గం నుండి మొదటిసారి ఓ గిరిజన మహిళ శాసనసభ్యురాలిగా ఎన్నికవడాన్ని కొందరు జీర్నించుకోలేక పోతున్నారని హరిప్రియ అన్నారు. అందువల్లే తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీలోని చివరి వరకు ఉంటానని స్పష్టం చేశారు. చివరి రక్తపు బొట్టు కూడా పార్టీ కోసమే సమర్పిస్తానని అన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా పార్టీని వీడనని హరిప్రియ వెల్లడించారు. 

శాసనసభ్యురాలిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి హరిప్రియ మీడియాతో మాట్లాడుతూ...ఇల్లందు నియోజకవర్గ అభివృద్దే ప్రస్తుతం తనముందున్న లక్ష్మమని అన్నారు. ప్రజా సమస్యలతో పాటు నియోజకవర్గ సమస్యలపై మాత్రమే దృష్టి పెడతానని...ఇలాంటి తప్పుడు ప్రచారాలను పట్టించుకోనన్నారు. తనను ఆదరించిన ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని హరిప్రియ అన్నారు.