మహబూబ్‌నగర్:పెద్దలను ఎదిరించి ప్రేమించి పెల్లి చేసుకొన్న జంటను విడదీశారు పెద్దలు. భార్య  కోసం భర్త సరిగా ఆహారం తీసుకోకుండానే పస్తులతో ప్రాణాలు వదిలాడు.ఈ ఘటన ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం నాడు చోటు చేసుకొంది.

Also read:తల్లిని చంపిన కీర్తి: చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక నిఘా

ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేట  మండలం చౌడూరుకు చెందిన 24 ఏళ్ల యాదగిరి అదే గ్రామానికి చెందిన యువతిని  ప్రేమించాడు. వీరిద్దరి కులాలు వేర్వేరు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు.దీంతో వీరిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సమక్షంలో నెల రోజుల క్రితం వీరిద్దరూ వివాహం చేసుకొన్నారు.

ఈ జంట పెళ్లి చేసుకొన్న తర్వాత గ్రామం నుండి వెళ్లిపోయారు.యాదగిరి తన బంధువు నివాసం ఉండే పరిగి మండలం బర్కత్‌పల్లి గ్రామంలో కాపురం పెట్టాడు.
15 రోజుల క్రితం చౌడూరుకు చెందిన కొందరు గ్రామ పెద్దలు బర్కత్‌పల్లికి వెళ్లారు. యాదగిరితో కాపురం ఉంటున్న యువతిని తీసుకొని చౌడూరుకు తీసుకొచ్చారు.

ఆ సమయంలో స్థానిక పోలీసుల సహాయం కూడ తీసుకొన్నారు.తన భార్య కోసం యాదగిరి తీవ్రంగా ప్రయత్నం చేశాడు. కానీ యాదగిరి భార్యను మాత్రం కలుసుకోలేకపోయాడు.

తన భార్యను తనకు దూరం చేశారనే మనోవేదనకు గురైన యాదగిరి సరిగా భోజనం చేయలేదు. పస్తులున్నాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బంధవులు ఆసుపత్రికి తరలిస్తుండగా ఆదివారం నాడు యాదగిరి మృతి చెందాడు. యాదగిరి మృతిని అనుమానాస్పద మృతిగా పరిగి పోలీసులు కేసు నమోదు చేశారు.

యాదగిరి మృతదేహాన్ని యువతి ఇంటి ముందు ఉంచి యాదగిరి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.