రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు జరగడం లేదు:ఎన్జీటీ విచారణలో డాక్టర్ సురేష్ బాబు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో బుధవారం నాడు విచారణ జరిగింది. ఈ ప్రాంతంలో ఎలాంటి పనులు జరగడం లేదని శాస్త్రవేత్త పసుపులేటి సురేష్ బాబు చెప్పారు.
న్యూఢిల్లీ: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు జరగడం లేదని ప్రయావరణ శాస్త్రవేత్త డాక్టర్ పసుపులేటి సురేష్ బాబు రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించిన శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ బాబు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై ఎన్జీటీ బుధవారంనాడు విచారణ నిర్వహించింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ ప్రాంతంలో సామాగ్రిని నిల్వ చేసినట్టుగా ఆయన చెప్పారు.ఈ ప్రాజెక్టుకు అనుమతులు పరిశీలనలో ఉన్నాయని ఆయన చెప్పారు.ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు అనుబంధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా మరో పిటిషన్ వేసింది.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే తమ రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు ఎడారిగా మారే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.