బంగారం లాంటి కోడలిని చంపేశాడు... నా కొడుకుని ఉరితీయండని ఓ మహిళ  పోలీసులను కోరిన సంఘటన సరూర్ నగర్ పోలీసు స్టేషన్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... సరూర్ నగర్ లోని శ్రీనివాస కాలనీకి చెందిన నారాయణకు ఒక్కగానొక్క కూతురు శ్వేత(28). ఆమెకు తొమ్మిది సంవత్సరాల క్రితం భగత్ సింగ్ నగర్ కి చెందిన రాముతో వివాహమైంది.

ఈ దంపతులకు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. కాగా.. ఇటీవల రాము తాగుడికి బానిసగా మారాడు. దీంతో దంపతుల మధ్య వివాదాలు మొదలయ్యాయి. రాము నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య తో గొడవపటం నిత్యకృత్యంగా చేసుకున్నాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం కూడా పెంచుకున్నాడు.

రోజూలాగానే మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన రాము.. నిద్రపోతున్న భార్య గొంతు నులిమి చంపేశాడు. తెల్లవారి లేచి చూసేసరికి కోడలు చనిపోయి ఉండటాన్ని రాము తల్లి అంజమ్మ గమనించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

తాగిన మైకంలో బంగారం లాంటి తమ కోడలిని తన కొడుకే చంపేశాడని.. తన కొడుకుని శిక్షించాలంటూ అంజమ్మ పోలీసులను కోరింది. పోలీసులకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.