ప్రేమించానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాటఇచ్చాడు. ఆమె తన సర్వస్వాన్ని అర్పించాక.. తప్పించుకు తిరిగాడు. ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటుందని తెలిసి..  పెద్దలకు తెలీకుండా రహస్యంగా  ఆమె మెడలో తాళి కట్టాడు. పెళ్లి జరిగింది కదా అని ఆ యువతి సంతోషించేలోపే.. కనిపించకుండా పోయాడు.  దీంతో బాధితురాలు న్యాయం చేయాలంటూ అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్లలో చోటుచేసుకుంది.

బాధితురాలు తెలతిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌లో నివాసముండే పసుల శ్రీకాంత్‌(26) అదే ఏరియాలో ఉండే మంద రవళి(23)ని ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకుని, తరువాత మొహం చాటేయడంతో మరొకరితో వివాహానికి రవళి సిద్ధమైంది.

ఆ సమయంలో పెళ్లికొడుకును బెదిరించి మళ్లీ రవళిని వివాహం చేసుకుంటానని చెప్పి దొంగచాటుగా తాళికట్టాడు. ఆ తరువాత రవళి అత్తగారింటికి వెళితే వారు బెదిరించడంతో పాటు శ్రీకాంత్‌తో సహా కుటుంబ సభ్యులందరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాధితురాలు శుక్రవారం మహిళా జాగృతి పట్టణాధ్యక్షురాలు మధురిమ అధ్వర్యంలో తన అత్తాగారింటి ముందు ఆందోళన చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.