ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపించింది ఓ యువతి.  కొత్త ప్రియుడి మోజులో.. పాత ప్రియుడు చేదుగా అనిపించాడు. అంతే.. అతనిని పథకం ప్రకారం అంతమొందించింది.

ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపించింది ఓ యువతి. కొత్త ప్రియుడి మోజులో.. పాత ప్రియుడు చేదుగా అనిపించాడు. అంతే.. అతనిని పథకం ప్రకారం అంతమొందించింది. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఫరూక్‌నగర్‌ మండల కేంద్రంలోని గుండుగేరికి చెందిన ఈరమోని శేఖర్‌(24) అదే ప్రాంతానికి చెందిన పర్వీన్‌బేగం(18) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పహాడీషరీఫ్‌ కోబా కాలనీకి చెందిన తోళ్ల వ్యాపారి మహమ్మద్‌ ఆసిఫ్‌ ఖురేషీ(23) ఉపాధి నిమిత్తం 8 నెలల కిందట గుండుగేరికి వచ్చాడు. పర్వీన్‌బేగంతో ఖురేషీకి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

ఇద్దరితో ప్రేమాయణం సాగిస్తున్న పర్వీన్‌బేగంను ఆసిఫ్‌ అనుమానంతో నిలదీశాడు. దీంతో పర్వీన్‌.. శేఖర్‌ తనవద్ద రూ.4500 అప్పు తీసుకున్నాడని, తిరిగి ఇవ్వకుండా లైంగికంగా వేధిస్తున్నాడని బుకాయించింది. ఇద్దరూ కలిసి శేఖర్‌ను అంతమొందించడానికి పథకం వేశారు. ఈనెల 19న రాత్రి శేఖర్‌ను పర్వీన్‌బేగం తన ఇంటికి రప్పించి మద్యంలో నిద్రమాత్రలు కలిపి తాగించింది. 

అతను మత్తులోకి వెళ్లగానే అసిఫ్‌, పర్వీన్‌బేగంలు కత్తులతో శేఖర్‌ గొంతు కోసి చంపేశారు. మృతదేహాన్ని అక్కడే ఇళ్ల మధ్యన పడేసి హైదరాబాద్‌కు పరారయ్యారు. అక్కడి నుంచి ముంబయికి పారిపోవడానికి షాద్‌నగర్‌కు వచ్చి పోలీసులకు చిక్కారు. ఆసిఫ్‌పై గత నేర చరిత్ర దృష్ట్యా రౌడీషీట్‌ తెరిచి పీడీ చట్టాన్ని ప్రయోగిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.