పోకిరిగాళ్ల కారణంగా హైదరాబద్ లో మరో యువతికి గాయాలయ్యాయి. శంషాబాద్ లో జరిగిన ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఆమెను వేధించడమే కాకుండా మద్యాన్ని ఆమెపై చల్లారు. అనంతరం మద్యం సీసాలతో కొట్టి గాయపరిచారు. 

వివరాల్లోకి వెళితే.. ఈ నెల 13న ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తోన్న 23 ఏళ్ల యువతి అర్ధరాత్రి విధులను ముగించుకొని ఇంటికి పయనమయ్యింది. అయితే లీమ్స్ హాస్పిటల్ వద్ద క్యాబ్ నుంచి ఆమె దిగగానే కొందరు దుండగులు ఆమెను బైకులతో వెంబడించారు. వెంట తెచ్చుకున్న మద్యాన్ని ఆమెపై చల్లుతూ వేధించారు.

ఆ సమయంలో కరెంట్ కూడా లేకపోవడంతో ఆ ప్రాంతమంతా చీకటితో నిర్మానుషంగా ఉంది. యువతీ భయంతో గట్టిగా అరవడంతో యువకులు వెళ్లిపోవాడానికి సిద్దమయ్యారు. అనంతరం ఆమెపై తాగిన మద్యం బాటిళ్లను విసిరి గాయపరిచారు. వెంటనే బాధితురాలు ఆర్జీఐఏ ఠాణా పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు. వీలైనంత త్వరగా దుండగులను పట్టుకుంటామని పోలీసులు తెలియజేశారు.