తినేముందు చేతులు శుభ్రం చేసుకొని తినాలని డాక్టర్లు, ఆరోగ్యశాఖ అధికారులు, ప్రభుత్వం పదే పదే చెబుతూనే ఉంటుంది. దానిని విస్మరించి ఓ మహిళ చేతులు శుభ్రం చేసుకోకుండానే భోజనం చేసి మృత్యువాత పడింది. ఈ సంఘటన అలంపూర్ లో చోటుచేసుకుంది.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే..మండలంలోని చంద్రశేఖర్‌నగర్‌ కాలనీకి చెందిన చిన్న రామన్న వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంటకు ఎలుకల బెడద ఎక్కువ కావడంతో బుధవారం భార్య పెద్ద ముణెమ్మ(51) గుళికల మందు పిచికారీ చేసింది.

ఈ క్రమంలో ఆమె చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకుండానే భోజనం చేసింది. దీంతో బుధవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే మానవపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించగా గురువారం ఉదయం మృతిచెందింది. ముణెమ్మ భర్త చిన్న రామన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.